హనుమకొండ చౌరస్తా, జూలై 14: నేర్చుకుంటూ, స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ రోబోటిక్స్సేవలందిస్తున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ గణితశాస్త్ర విభాగంలోని ఎస్.ఆర్. రామానుజం సెమినార్హాల్లో యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ అధ్యక్షతన ‘డిప్లోయాబుల్ రోబోటిక్స్ దట్ లర్న్ అనే అంశంపై నిర్వహించిన విస్తృతోపన్యాసంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సాంకేతిక రంగం రోబోటిక్స్అత్యంత వేగంగా రూపాంతరం చెందుతోందని, ఇప్పటికే అన్ని ప్రధాన రంగాల్లో రోబోటిక్స్ వినియోగం విస్తృతమవుతోందన్నారు. రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతల్లో దేశ, విదేశాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అయితే రోబో ఒక యంత్రం మాత్రమేనని, మానవ మేధస్సు, సృజనాత్మకత, విలువలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా, ఉద్యోగాలను సృష్టించే వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే కాకతీయ విశ్వవిద్యాలయ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ విద్యా, పారిశ్రామిక సంస్థలతో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ప్రభుత్వం, విశ్వవిద్యాలయం కల్పించే స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టి-హబ్ ద్వారా ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ కార్యక్రమాల్లో భాగంగా తొలి విడతలో 100 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సెయింట్ సంస్థ సహకారంతో మరో 100 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కల్పించనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న క్లిష్ట సవాళ్ల పరిష్కారంలో రోబోటిక్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.