ఖిలా వరంగల్: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగాం నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు.
అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండాలని అతిథులు సూచించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. నృత్యాలు, పాటలు, నాటికలతో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి సందడి చేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.