సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణకు ముందు సంపన్న వర్గాలు ఉండే ‘బంజారా’హిల్స్ పేరుకు మాత్రమే చెప్పుకునేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తలపించేలా, వారి అస్తిత్వాన్ని గుర్తించేలా బంజారా సేవాలాల్ భవన్, గిరిపుత్రులకు కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్‌ను నిర్మించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రిది. నగర నడిబొడ్డున బంజారాహిల్స్‌లో కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్లను ఒక్కోదానికి రూ. 24.5 కోట్ల ఖర్చుచేసి సర్కారు నిర్మించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం శనివారం గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
ఆదివాసీ, బంజారా కళలు, సంస్కృతికి పెద్దపీట..
ఒకనాడు లంబాడా, గుస్సాడీ లాంటి నృత్యాలు తండాలకు, ఆదివాసీ గూడాలు, చెంచు పెంటలకే పరిమితంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాష్ట్ర రాజధాని నగరంలో ఏ కార్యక్రమమైనా ఆదివాసీ, గిరిజన నృత్యాలు స్వాగతం పలకాల్సిందే. ట్రైబల్ సంస్కృతిని ప్రతిబింబించే కళాకారులు, సంస్కృతిని పరిరక్షించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆచారాలను గౌరవిస్తూ గిరిపుత్రుల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. గిరిజనులు, వారి కళలు, సంస్కృతిని తండాలు, ట్రైబల్ ఏజెన్సీల నుంచి పట్టణాలకు వ్యాపింపజేసిన ఘనత తెలంగాణ ఉద్యమమైతే.. ఆ సంప్రదాయ కళలను పరిరక్షించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదిగా మారింది. బంజారాలు, ఆదివాసీలు, చెంచు గూడేల ఆరాధ్య దైవంగా సీఎం కేసీఆర్ నిలిచారని చెబుతున్నారు.
గిరి పుత్రులకు విద్యావకాశాల్లో మెరుగుదల ..
సీఎం కేసీఆర్ మడమతిప్పని నేతగా నిలిచారు. నూతన డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో గిరిజన యువతకు ఉన్నత విద్యను చేరువ చేశారు. అన్ని రంగాల్లో ఎస్టీ విద్యార్థులు ఎదగాలనే ఉద్దేశంతో న్యాయ కళాశాల, ఫైన్ఆర్ట్స్ కళాశాల, సైనిక పాఠశాల, పీజీ కళాశాలలు, దివ్యాంగులకు కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన విద్య వికసిస్తున్నది. గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు బీఏఎస్ పథకం ద్వారా ప్రస్తుతం అందిస్తున్న రూ.30వేల ఫీజును రు. 42 వేలకు పెంచింది. దీంతో నాణ్యమైన విద్య ద్వారా 80 సూళ్లలో చదువుతున్న 6,000 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ద్వారా తొమ్మిదేండ్లుగా రూ.157.25 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేసింది.
ఎస్టీల రిజర్వేషన్లు పెంచిన కేసీఆర్..
రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఫలితంగా గిరిజన విద్యార్థులకు విద్యతోపాటు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దీంతో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో గిరిజనులకు సీట్లు అదనంగా రానున్నాయి. ప్రభుత్వం జారీచేసే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లలో గిరిజన జనాభా ప్రకారం ఉద్యోగాలు దక్కనున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా మద్యం దుకాణాల నిర్వహణ కోసం లైసెన్స్‌ల్లో ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో గ్రేటర్ పరిధిలో ఎంతో మంది ఎస్టీలకు లబ్ధి చేకూరింది.
గిరిజనుల సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్..
నగర పరిధిలోని డ్రైవర్ ఎంపవర్మెంట్ ద్వారా 441 మంది గిరిజనులకు 19.56 కోట్ల సాయంతోపాటు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా 1072 గిరిజనులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందుకోసం రూ 16.43 కోట్లతో 160 రకాల యూనిట్లు ఏర్పాటు చేసింది. గిరిజనులను పట్టణ ప్రాంతాల్లో సొంతంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం మలిచింది.