హనుమకొండ చౌరస్తా, మార్చి 12: అనుకున్నది ఒకటి.. అయింది మరొక్కటి అన్నట్లుగా మారింది అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు. హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పనుల్లో మనం ఒకటి చేయిస్తే మరోటి అయింది. ఈత కొలను మరమ్మతుల్లో భాగంగా ఒకవైపు పగుళ్లు ఏర్పడటంతో మరమ్మతులు చేయించారు. గత నెలలో నీళ్లు నింపడంతో ఇంకా పగుళ్లు ఏర్పడి మొత్తం ఒకవైపు గోడ కూలిపోయే పరిస్థితి ఏర్పడటంతో పరిశీలించిన అధికారులు ఉన్న ఫలంగా గోడను తొలిగించేందుకు చర్యలు చేపట్టారు. స్విమ్మింగ్‌పూల్ మరమ్మతుల పనుల కోసం మంజూరు చేయించిన నిధులు సరిపోకపోవడంతో మరో రూ.10 లక్షలు అదనంగా గోడ కట్టేందుకు కేటాయించారు.
ఇటీవల కలెక్టర్ చాహత్ బాచ్పేయ్ పరిశీలించి ఏప్రిల్ 1 నాటికి స్విమ్మింగ్‌పూల్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించినప్పటికీ తూతూమంత్రంగా పనులను నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశించినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో స్విమ్మిర్లకు ఇబ్బందులు తప్పడంలేదు. ఏడు నెలలుగా మరమ్మతులతోనే మమ అనిపిస్తున్నా ఇంకా పనులు మాత్రం పూర్తి కాలేదు. అసలే ఎండా కాలం ప్రారంభమై భగభగమండుతోంది. విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకుందామంటే ఈసారి ఈత లేనట్లుగానే కనిపిస్తోంది.
రూ.41 లక్షలతో మరమ్మతులు
హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ కొనసాగుతోంది. పూల్‌లో పలు మరమ్మతులు, వసతుల కల్పన కోసం డీఎస్ఏ నిధుల నుంచి రూ.41 లక్షలు కేటాయించారు. ఆయా పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. సుమారు ఏడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. మినీ బేబీ స్విమ్మింగ్ పూల్ పగుళ్లుతోనే దర్శనమిస్తోంది. ఇంకా పనులు చేపట్టలేదు. త్వరతగతిన పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల కలెక్టర్ పరిశీలించి అధికారులను ఆదేశించారు. సోలార్, రెండు కొత్త మోటార్లు, షెడ్ నిర్మాణం, వాటర్ ఫిల్టర్ చేంజ్, సంపుపై స్లాబ్ మరమ్మతు, ఎలక్టిక్, శానిటరీ వర్క్ పనులు చేపట్టారు.
నత్తనడకన పనులు..
కలెక్టర్ ఆదేశించినా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులను చేస్తుండడంతో పది నెలలు కానొస్తున్నా ఇంకా పనులు పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది స్విమ్మింగ్ పూల్ ఇప్పటికీ మరమ్మతులు పూర్తి చేయలేకపోయారు. అంతేకాకుండా పనుల్లో జాప్యం కారణంగా యువ స్విమ్మర్ల కెరియర్ నష్టపోతుంటే, ఆరోగ్య పరిరక్షణ కోసం స్విమ్మింగ్ పూల్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు.
రూ.10 లక్షలు లాస్..
అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా యువ స్విమ్మర్లు సాధనకు దూరమవుతున్నారు. నిత్యం సాధన చేస్తూ జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడే స్విమ్మర్లకు స్విమ్మింగ్‌పూల్ మరమ్మతులు అడ్డంకిగా మారాయి. సుమారు పది నెలలుగా సాధన లేక మానసికంగా, శారీరకంగా కుదేలవుతున్నారు. ఎండాకాలంలో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఉదయం, సాయంత్రం ఎంతోమంది వస్తారు. మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ప్రతిఒక్కరూ స్విమ్మింగ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో స్విమ్మింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. పది నెలలుగా మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రూ.10 లక్షల వరకు లాస్ అయినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
ఇంకా స్విమ్మింగ్‌పూల్ పనులు పూర్తికాకపోవడంతో ఈసారి ఈత కొట్టడం కష్టంగా మారింది.
త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం..
స్విమ్మింగ్ పూల్‌లో పగిలిపోయిన టైల్స్, గ్రానైట్స్ కొత్తవి, పైపులైన్ మరమ్మతులు చేశారు. కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. 75 శాతం నీళ్లు నింపడంతో గోడ క్రాక్ వచ్చింది. ఎప్పుడో పాత గోడ బేస్మెంట్కు, ఇటుకకు గ్యాప్ ఉండటం కూలిపోయే ప్రమాదం ఉంది. గోడను కూల్చివేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే గోడను తొలిగించాం. ఇటీవల కలెక్టర్ కూడా పరిశీలించారు. గోడ కట్టడానికి రూ.9 లక్షలు అదనంగా కేటాయించారు. ఐదు, పది రోజుల్లో పూర్తిచేస్తారు. ఇప్పటికే మరమ్మతుల కోసం సుమారు రూ.40 లక్షల వరకు కేటాయించారు. సోలార్, రెండు కొత్త మోటార్లు, షెడ్ నిర్మాణం, వాటర్ ఫిల్టర్ చేంజ్, సంపుపై స్లాబ్ మరమ్మతు, ఎలక్టిక్, శానిటరీ వర్క్ పనులు చేశారు. త్వరలోనే పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తాం.
– గుగులోతు అశోక్‌కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి