భీమదేవరపల్లి, మార్చి 15: కృత్రిమ మేధ (AI) బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి మారెపల్లి సునితా రాణి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధా గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అభ్యాసనా సామర్ధ్యాలు పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు స్వయంగా భాషా సామర్ధ్యాలు సాధన చేసి ఆంగ్లభాషపై అలవోకగా పట్టు సాధిస్తారని పేర్కొన్నారు.
తెలుగు భాష ద్వారా ఇంగ్లిష్ నేర్చుకోవడంలో కృత్రిమ మేధ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ బోధనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోలవేని రవి ప్రకాష్, పాఠశాల హెచ్ఎం మార్కండేయ, ఉపాధ్యాయులు కొమురయ్య, రాజ్య ప్రభ, శ్రీదేవి, రాధిక, రాజునాయక్, సీఆర్పీ హిమాసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.