హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ (Corporate budget )అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షపై బుధవారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్ లో వామపక్ష పార్టీలు చేతికి సంకెళ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
ఏపీ పునర్విభజన చట్టం అమలును బీజేపీ నిర్లక్ష్యం చేసిందని, నిర్లక్ష్యానికి గురైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులోని తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించలేదన్నారు. లక్షలాదిమంది యువకులకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టును మూలకు పడేయడం దారుణం అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రాంతీయ అసమానతలు భారత ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు అయినప్పటికీ బడ్జెట్ వాటిని పరిష్కరించడంలో విఫలమైందన్నారు.
భారతీయ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయిందని, విదేశీ రుణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ వంటి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, విద్య, వైద్యం, సామాజిక రంగాలకు తగిన కేటాయింపులు లేకపోవడంతో సామాజిక రంగం, అట్టడుగు వర్గాల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.జ్యోతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మండ సదాలక్ష్మి, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, రాసమల్ల దీనా, బత్తిని సదానందం, మాలోతు శంకర్ నాయక్, సుదర్శన్, మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, రొంటాల రమేష్ దేవా, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్, నిమ్మల మనోహర్, సీపీఎం జిల్లా నాయకులు ఎస్. వాసుదేవ రెడ్డి, ఎం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, వీరన్న నాయక్, జి.రాములు, సాంబయ్య, ఆర్ఎస్పీ జిల్లా నాయకులు కె. శివాజీ, తదితరులు పాల్గొన్నారు.