హనుమకొండ చౌరస్తా, మార్చి 31: చారిత్రక రుద్రేశ్వరాలయంలో శివప్రీతికరమైన సోమవారం 2వ రోజు నూతన సంవత్సరాది ప్రారంభం సందర్భంగా 121 మంది పుణ్యదంపతులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం విష్ణుఆలయంలో శ్రీరామకళ్యాణ బ్రహ్మోత్సవాలు 2వ రోజు శ్రీరామశోడశోపచార పూజా విధానం ఆవాహం, ఆద్యం, ఆచరనీయం, పంచామృతస్నానం యజ్ఞోపవిత్రం ఆక్షంతలు అంగపూజ అనంతరం స్వామివారిని జానకీ వల్లభునిగా అలంకరించి పాయసాన్నం నైవేద్యం సమర్పించారు.
నీరాజన మంత్రపుష్పాలు అనంతరం యాగశాలలో లోకకళ్యాణార్థం భక్తుల గోత్రనామాలతో గణపతి నవగ్రహ మహాసుదర్శన హోమం, తెల్లనువ్వులు, వివిధ సుగంధ ద్రవ్యపరిమలాలతో నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఆగమ పండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు క్రతువులు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో డి.అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్‌శర్మ, సిబ్బంది రామకృష్ణ పాల్గొన్నారు.