హనుమకొండ చౌరస్తా, జనవరి 18 : కళాకారులకు, కళాభిమానులకు ఓరుగల్లులో కొదవలేదని సంగీత కార్యక్రమాలు నగరంలో క్షిపణిలా దూసుకుపోతున్నాయని ప్రముఖ కవి మహమ్మద్ సిరాజుద్దీన్ అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘స్వరనీరాజనం’ సంగీత కార్యక్రమాన్ని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సీనియర్ కళాకారులు జగదీశ్వర్‌రావు, రామారావు, రవికుమార్, వాణిశ్రీ, పోతనచారిలతో కలిసి నిర్వాహకురాలు గంగాధరి పద్మావతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరంలో మంచి ఉద్దేశంతో జరిగే ప్రతి కార్యక్రమానికి తనవంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని, కళలు, సంస్కృతి నిలబడాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, యువతను కళల వైపు తీసుకెళ్లడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సుమారు 40 మంది గాయనీ-గాయకులు వివిధ చిత్రాలలోని పాటలను ఆలపించి ప్రేక్షకులను మైమరిపించారు. రవికిరణ్ వ్యాఖ్యాత కార్యక్రమం మరింత రక్తికట్టింది. కార్యక్రమంలో కళారాజేశ్వరరావు, సుధాకర్, ఉపేందర్, కళ్యాణి పాల్గొన్నారు.