vishwa brahmana dorala gadi | గట్ల మల్యాల సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ ఉన్న గడీని దొరల మల్యాలగడి అని, గట్ల మల్యాల గడి అని కూడా పిలుస్తారు. విశ్వబ్రాహ్మణులలో కంసాలులు, అవుసలివాండ్లు, స్వర్ణకారులని పిలువబడే కులం వారి దొరతనపు గడి గట్లమల్యాల. అందుకే ఈ గడిని అవుసులోల్ల గడి అని కూడా పిలుస్తారు. వృత్తి కళాకారులైన వీరికి దొరతనం దక్కడం, గడి నిర్మాణం చేసుకోవడం తెలంగాణలో ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు. నంగునూరు మండలంలోని ఈ గ్రామంలో గట్ల మల్యాల గడి 6 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ గడిని నిర్మాణం చేయించింది కత్తూరిపల్లి సత్యనారాయణ. గట్ల మల్యాల గ్రామస్థాపకుడు సీతారామారావు.
నిజాంరాజు కొన్ని ప్రాంతాలను హర్రాస్(వేలం) ద్వారా తనకు నచ్చినవాళ్ళకు ఇచ్చాడు. వాళ్లను హర్రాస్ దార్లను పిలుస్తారు. హర్రాస్ ద్వారా దక్కిన భూభాగాలకు హర్రాస్ దార్లు పన్ను, కప్పం కట్టనవసరంలేదు. అది ఈ వృత్తి కళాకారులకు ఇచ్చిన గౌరవం. అంతేకాదు నిజాం తన కొలువులో వీరికి కుడివైపు ఆసనాలిచ్చి గౌరవించేవాడట. వీరికి రావుబహద్దూరు బిరుదులిచ్చి ఉండవచ్చుననిపిస్తుంది. గట్లమల్యాలలోని రాళ్లతో నిండిన భూములను సేద్యయోగ్యం చేయించి గ్రామాన్ని అభివృద్ధి చేశారు విశ్వబ్రాహ్మణదొరలు. దాదాపు 400 ఎకరాలకు పైననే వ్యవసాయ యోగ్య భూములను సిద్ధ పరిచారు. యాభై నాగండ్లతో పొలాలు దున్నించేవారట. మొత్తం పొలాలన్నీ వారి స్వాధీనంలోనే వుండేవి.
దొరల ఎడ్ల కచ్చురం వెంట రైతులు
సత్యనారాయణరావుకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. కొడుకులు రాంకిషన్ రావు(రామకృష్ణ), యాదగిరిరావు, వేంకటేశ్వర్ రావులు ముగ్గురికి మూడు గడీలు కట్టించాడు సత్యనారాయణరావు. వాటిని పెద్దదొరగడి, నడిపిదొరగడి, చిన్నదొరగడి అని పిలుస్తారు ఇక్కడి ప్రజలు. పెద్దదొర గడి మట్టి, గూనపెంకులతో ఉండగా, మిగతా ఇద్దరి గడీలు డంగుసున్నంతో అలంకరణలతో కట్టించబడ్డాయి. గడిలో ప్రధానద్వారం వద్ద చౌకీదారుకు గది, దాస, దాసీలకు కూడా ప్రత్యేకమైన గదులు కట్టించారు.
పెద్ద దొరగడి ఐదు భాగాలుగా కట్టబడింది. గూనపెంకల కప్పుతో ఉంది. నడిపిదొరగడికి పెద్దదర్వాజ ఉంది. దానిపక్కన మైసమ్మగుడి ఉంది. ఈయనకు గుర్రాలంటే ఇష్టం. గుర్రపుశాలలు నిర్మింపజేశారు. ధాన్యపు గరిసెలు కూడా వాటి పక్కనే ఉన్నాయి. చిన్నదొరగడి ప్రధాన ద్వారం పక్కనే ఉంది ఈ గడి. అందమైన పూలతీగెల డిజైన్లతో గోడలు అలంకరించబడ్డాయి.
నడిపి దొర యాదగిరిరావు గట్లమల్యాల సర్పంచ్‌గా పనిచేశాడు. కో ఆపరేటివ్ బ్యాంకు చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నాడు. నాగసముద్రం నుంచి ఊరికి 11 కి.మీ.ల రోడ్డు వేయించాడట. ఈ దొరలు గ్రామంలో పాఠశాల నిర్మాణానికి రెండున్నర ఎకరాలు దానం చేశారు. వీరు ఇప్పటికీ గ్రామాభివృద్ధికి కావలసిన సహకారాన్ని అందజేస్తున్నారు. గట్లమల్యాల ప్రజలు బంగారం పనిచేసే స్వర్ణకారుల దొరతనపు పాలనను బంగారమేనంటున్నారు. అయితే ఈ దొరల వంశమూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయంటున్నారు హైదరాబాద్‌లోని కత్తూరిపల్లివారు. అదిమరొక అన్వేషణ.
కొసమెరుపు: గట్లమల్యాల గ్రామంలో ఎక్కడ చూసిన రాళ్లు కనిపిస్తాయి. పొలాల్లో మెన్హర్లు కనిపించాయి. మెగాలిథిక్ సమాధుల ఆనవాళ్లు కనిపించాయి. కొత్తరాతియుగపు రాతిపనిముట్లు కనిపించాయి. ఇది మరెక్కడా జరగని కథ
అందమైన తీగల డిజైన్లతో గడి ఒక ద్వారం
– కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్
విశ్వబ్రాహ్మణుల గడి ఎక్కడాలేదు గట్లమల్యాలలోనే కనిపిస్తుంది. నేను 2018లో ఈ గడిని సందర్శించి నిశితంగా పరిశోధన చేశాను. ఈ గడిని నిర్మాణం చేయించింది కత్తూరిపల్లి సత్యనారాయణ. కంసాలి వృత్తి జీవితంగా ఉన్న ఈ హస్తకళాకారులకు దొరతనం దక్కడం, కోటవంటి గడి నిర్మాణం, ఊర్లమీద పెత్తనం నిజాంకాలంలో జరిగింది. మరెక్కడా జరగని కథ. నిజాం రాజు కొన్ని ప్రాంతాలను హర్రాస్(వేలం) ద్వారా తనకు నచ్చినవాళ్లకు ఇచ్చాడు. వాళ్లను హర్రాస్దార్లను పిలుస్తారు. హర్రాస్ ద్వారా దక్కిన భూభాగాలకు హర్రాస్ దార్లు పన్ను, కప్పం కట్టనవసరంలేదు. అది ఈ వృత్తి కళాకారులకు ఇచ్చిన గౌరవం. అంతేకాదు నిజాం తన కొలువులో వీరికి కుడివైపు ఆసనాలిచ్చి గౌరవించేవాడట. వీరికి రావుబహద్దూరు బిరుదులిచ్చి ఉండవచ్చుననిపిస్తుంది. గట్లమల్యాలలోని రాళ్లతో నిండిన భూములను సేద్యయోగ్యం చేయించి గ్రామాన్ని అభివృద్ధి చేశారు విశ్వబ్రాహ్మణదొరలు. దాదాపు 400 ఎకరాలకు పైనే వ్యవసాయ యోగ్య భూములను సిద్ధపరిచారు.యాభై నాగండ్లతో పొలాలు దున్నించేవారట. ప్రజలతో కలివిడిగా ఉండేవారు. ఎవరిని తమ దొరతనంతో వేధించిన సంఘటనలు లేవు. తెలంగాణ చరిత్రలో ఇదొక అపూర్వఘట్టం.
✍️ గుడికందుల కిషోర్, హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి.