ఖిలావరంగల్, ఫిబ్రవరి 24: గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ద్వితీయ వార్షిక మహోత్సవం కనుల పండువగా జరిగాయి. సోమవారం ఉదయం ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, సామూహిక రుద్రాభిషేకాలు రుత్వికులు ఘనంగా నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శ్రీ శివపార్వతీ సమేత భక్త మార్కండేయ, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అభయాంజనేయ, నవగ్రహాల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా చండీ హోమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
మంగళవారం ఉదయం దేవత హవనం, పూర్ణాహుతి అనంతరం శివపార్వతుల శాంతి కళ్యాణం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ, భవన నిర్మాణ సమితి కన్వీనర్ వడ్నాల సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో పరపతి సంఘం, భవన నిర్మాణ సమితి సభ్యులు, పాశికంటి రవికుమార్, ఊరుగొండ సారంగపాణి, పాశికంటి రాజేశ్వరరావు, రాపెల్లి చంద్రమౌళి, తౌటం మధు, శామంతుల బిక్షపతి, పూజారులు, కార్యవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది కస్తూరి శ్రీనివాస్, భాస్కర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.