జనగామ, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించి ప్రెస్టన్ గ్రౌండ్లో నిరసన తెలిపారు. తమ వేతనాలు పెంచే వరకు బస్సులు నడిపేది లేదని హెచ్చరించారు. వేతనాల పెంపుతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. పలు గ్రామాలకు బస్సులు నడవక విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబ పోషణ కష్టమైందని డ్రైవర్లు వాపోయారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి తమ డిమాండ్లపై అద్దె బస్సుల యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిషరించాలని కోరారు.
హనుమకొండలో ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు రూ.21 వేలు, పల్లె వెలుగు డ్రైవర్లకు రూ.20 వేల వరకు వేతనం ఇస్తుంటే జనగామలో మాత్రం తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా అదే విధుల్ని నిర్వర్తిస్తున్నా వేతనాల్లో తేడా ఎందుకని ప్రశ్నించారు. అద్దె బస్సులపై రోజుకు ఎకువసేపు విధులు నిర్వర్తిస్తున్నా తగిన వేతనం అందడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచి జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు.