భీమదేవరపల్లి, జనవరి 9: భక్తుల కొంగుబంగారం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఈనెల 18వ తేదీన స్వామివారి గ్రామ పర్యటనతో ముగుస్తుంది. ఇప్పటికే స్వామివారి కల్యాణ మహోత్సవ వేదిక అందంగా ముస్తాబవుతుంది. జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
కోరిన కోరికలు తీర్చాలని స్వామివారికి కోరమీసాలు సమర్పిస్తారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పన, తాగునీటి సదుపాయం, వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
స్థల పురాణం
కాకతీయ రుద్రేశ్వరుని కాలంలో మల్లికార్జున పండితుని మనువడు కేదారి పండితునిచే వీరభద్ర స్వామి ఆలయం శైవాగమానుసారముగా ప్రతిష్టింపబడినట్లు స్థల పురాణం చెప్పబడుచున్నది. క్రీ.శ. 1600 సంవత్సర ప్రాంతంలో కొంతమంది కుమ్మరులు కొండపైకి ఎడ్లబండ్లు కట్టుకొని పోయారు. అక్కడ వారికి అవసరమయ్యే కర్రలు కొట్టుకొని ఎడ్లబండ్లలో వేసేందుకు చూడగా ఎద్దులు, బండి కనిపించలేదు.. వారు కొండ చుట్టూ కలియతిరిగి అలసిపోవడంతో ఆ రాత్రి కొండపైననే నిద్రించారు. వీరభద్ర స్వామి వారు కలలో వారికి కల్పించి నన్ను ఈ కొండపై నుంచి దింపి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టింపమని వారికి ఆజ్ఞాపించారు. దీంతో మల్లికార్జున పండితుని మనువడు కేదారి పండితునిచే స్వామివారిని కిందకు దింపి ఆలయంలో ప్రతిష్టించారు.
బ్రహ్మోత్సవాల్లో జరిగే కార్యక్రమాలు
ఈనెల 10వ తేదీన సాయంత్రం వీరభద్ర స్వామి వారి కళ్యాణం 14న (భోగి పండుగ) అరుణ యంత్ర స్థాపన, చండీ హోమం, 15న (మకర సంక్రాంతి), ఉత్తరాయణ పుణ్యకాలం, ఎడ్ల బండ్లు తిరుగుట,
16న (కనుమ), నందీశ్వర అభిషేకం, పుష్ప యాగం,
17న మహా పూర్ణాహుతి, త్రిశూల స్నానం,
18న వేకువ జామున అగ్నిగుండాలు, సాయంత్రం స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఆలయ ఆవరణలో దేవత వృక్షాలు
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా స్వామివారి ఆలయంలో దేవత వృక్షాలు ఉన్నాయి. రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి చెట్లు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో రాలి పడే రుద్రాక్షల కోసం భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తారు. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తులు అధిక సంఖ్యలో దర్శించు కుంటారు. ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు జాతరకు హుస్నాబాద్, హుజురాబాద్, వరంగల్- 1 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నిరంతరం నడుస్తాయి.
అడుగడుగునా నిఘా నేత్రాలు
బ్రహ్మోత్సవాలకు అడుగడుగున అధికారులు నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా జాతర ప్రాంగణంలో నలువైపులా రూట్ మ్యాప్ ఫ్లెక్సీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరైనా బ్రహ్మోత్సవాల్లో దారి తప్పితే రూట్ మ్యాప్ ఆధారంగా గమ్యం చేరుకునేలా సదుపాయం కల్పిస్తున్నారు.
జాతరలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 700మంది భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో అడుగడుగునా పోలీస్ పహారా, గస్తీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
భక్తులకు పూర్తి సదుపాయాలు : ఆలయ ఈవో కిషన్ రావు
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా పూర్తి సదుపాయాలు కల్పించాము. తాగునీటితో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. స్నానాల గదులు, మరుగుదొడ్లు నిర్మించాము.పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వృద్ధుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం పూర్తి వసతులు కల్పిస్తున్నాం. వైద్య శిబిరం, అగ్నిమాపక కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.