నయీంనగర్ : నాకు భయం వేస్తోంది పరీక్ష హాల్లోకి వెళ్లను(Exam center) అని పరీక్ష కేంద్రం వద్ద మారం చేసిన బాలుడుని పోలీసులు ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండలో (Hanmakonda) జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి తొమ్మిదవ తరగతుల్లో ప్రవేశాలకు ఆదివారం అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఈక్రమంలో పలి వేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాసేందుకు తండ్రితో వచ్చిన ఓ విద్యార్ధి నేను లోపలికి పోను నాకు భయం వేస్తోందని మారం చేశాడు. అక్కడే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ అ విద్యార్థిని గమనించారు. బాలుడిని బుజ్జగించి, ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. సదరు విద్యార్థిని పరీక్ష రాసేందుకు పోలీసులు చూపిన చొరవపై ప్రశంసలు వెల్లువెత్తాయి.