Snakes in Hospital | భీమదేవరపల్లి, మే 28: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్వగ్రామమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రభుత్వ ఆసుపత్రిలో పాములు హల్చల్ చేస్తున్నాయి. ఆస్పత్రి భవనం శిథిలావస్థలో ఉండటం, ఆస్పత్రి ఆవరణ అంతా పిచ్చి చెట్లు, ముళ్ళ కంచె ఉండటంతో పాములు, తేళ్లు, విషపురుగులకు ఆవాసంగా మారాయి. దీంతో గత నెల రోజులుగా వైద్య సిబ్బంది ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేసేందుకు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
ఆవరణలో పాములు ఉన్నాయని తెలియడంతో రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు జంకుతున్నారు. కాగా 15 రోజుల క్రితం ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది ఎండీ గౌస్ పాషా రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. తోటి సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య సిబ్బంది గౌస్ పాషా పాము కాటుకు గురయ్యాడనే విషయాన్ని వైద్యాధికారులు గోప్యంగా ఉంచడం సంచలనంగా మారింది. అప్పటినుంచి వైద్య సిబ్బంది రాత్రిళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. విష సర్పాలకు ఆవాసంగా మారిన ఆస్పత్రి పై సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకోవాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఆసుపత్రిలో దర్శనమిస్తున్న విషసర్పం