ఖిలావరంగల్, ఫిబ్రవరి 23: మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ (సీఐటియు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులు ఏకశిలా పార్క్ నుండి ర్యాలీగా వరంగల్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం బైఠాయించి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరోరి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికల నిర్వహణ వంటి కీలక సేవలు అందిస్తున్నప్పటికీ, వారికి సమయానికి వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం కారణంగా రాష్ట్రంలో సుమారు 200 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, ఉద్యోగ భద్రత లేకుండా ఆదివారం, పండుగ సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. రెండు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే విడుదల చేసి చెల్లించాలని, 51 జీఓను సవరించాలని, పంచాయతీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తీసుకుని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్లో నమోదు కాని కార్మికులను నమోదు చేసి, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, కనీస వేతనాలను రూ.26,000గా నిర్ణయించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. ఆన్లైన్ నమోదు కాని సిబ్బందికి వెంటనే నమోదు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులు పంచాయతీ సిబ్బందిపై వేధింపులు, తొలగింపులు నిలిపివేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నగరకంటి రామచందర్, జిల్లా మహిళా కన్వీనర్ గజ్జల మౌనిక, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు గోపి, జిల్లా నాయకులు బిక్షపతి, మెరుగు మదర్ భాషా, జన్ను సూరమ్మ, సవిత, ఉపేంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.