హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 18: చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపువేళ ఉదయం రుద్రేశ్వరునికి పంచామృత అభిషేకం నిర్వర్తించారు. ఆలయ ప్రాంగణంలోగల క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు, చందనపూజ, ఆకుపూజ(నాగవళి), వడమాల, పుష్పమాల, జిల్లేడుపూలతో ఆంజనేయ స్వామికి అర్చన నిర్వర్తించారు. మంత్రపఠణంతో ఆంజనేయస్వామిని ఆరాధించి చిత్రాన్న నైవేద్యం సమర్పించి, ఆంజనేయ స్వామికి ఐదు రకాల పండ్లతో నివేదన, ధూపదీప నైవేద్యాలు, నీరాజన మంత్రపుష్పం సమర్పించారు.
అనంతరం యాగశాలలో గణపతి నవగ్రహ రుద్ర జయాధి పంచసూక్తములతో హోమం నిర్వర్తించి సుగంధ పరిమళద్రవ్యాలు, నవధాన్యములు కలిపి లోకకళ్యాణార్థం ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన యాగాన్ని పూర్తిచేసి మహాపూర్ణాహుతి నిర్వర్తించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. దాతలకు, సహకరించిన భక్త బృందానికి వేద ఆశీర్వచనం నిర్వర్తించి బ్రహ్మోత్సవాలు సమాప్తి చేశారు.
ఆలయ కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి సహకరించిన స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మున్సిపల్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, సిటీ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, ప్రముఖ దాతలైన వద్దిరాజు వెంకటేశ్వరరావు, సీతారాంరెడ్డి, కృష్ణవేణి, వేముల సత్యమూర్తి, అయినవోలు వెంకటసత్యమోహన్, ఇతర శాఖ అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వెంకటేశ్వర సేవాసమితి మహిళా సభ్యులకు, ఎన్ఎస్ఎస్ బృందానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి.అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, ఆలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.