హనుమకొండ చౌరస్తా, జనవరి 7: మేడారం జాతర భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తుందని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఆర్టీసీ పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. రీజనల్ మేనేజర్ శ్రీ దర్శనం విజయభాను ఆధ్వర్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్ రీజియన్ల ట్రాఫిక్, మెయింటెనెన్స్ఇంఛార్జిలతో సమావేశం వరంగల్లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరిగింది.
ఈ సందర్భంగా ఈడీ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. వాహనాలు బ్రేక్డౌన్ అయితే ట్రాఫిక్జామ్ అయ్యే ప్రమాదం ఉన్నందున జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు బస్సుల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెయింటెనెన్స్ అధికారులను ఆదేశించారు. బ్రేక్డౌన్లకు ఆస్కారం లేకుండా బస్సులను సిద్ధం చేయాలని సూచించారు.
భక్తులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ యంత్రాంగం పని చేస్తోందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్లు రవిచంద్ర, పి.సైదులు, ఎల్.రవీందర్, రాష్ర్టంలోని ఏవోలు, డిప్యూటీ సీఏఓలు పాల్గొన్నారు.