హనుమకొండ, అక్టోబర్ 6 : వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10, 11, 12 తేదీలలో జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని జాతీయ నాయకుడు పి.మహేష్, రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వి. శ్రీకాంత్, పొడపంగి నాగరాజు పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ర్ట కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమాల పురిటి గడ్డైన ఉస్మానియా యూనివర్సిటీలో 1970వ దశకంలో భగత్‌సింగ్, చేగువేరా వీరోచిత పోరాటాల స్ఫూర్తితో, నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల ఓరవడిని కొనసాగిస్తూ పురుడు పోసుకున్న ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం శాస్త్రీయ విద్యాసాధన, సమసమాజస్థాపనే లక్ష్యంగా, సమాజంలో ఉన్న అన్ని అసమానతలకు వ్యతిరేకంగా, అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యకోసం పోరాడుతుందన్నారు.
ఈ లక్ష్యసాధనలో రాజ్యహింసకు కామ్రేడ్ జార్జిరెడ్డి, జేసిఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, చేరాలు, రంగవల్లి లాంటి ఎందరో విద్యార్థి యువకిశోరాలు ఈ వ్యవస్థ మార్పు కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా నేడు సామ్రాజవాదం, పెట్టుబడిదారీ విధానం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, అమెరికా ఇజ్రాయిల్ దేశాలు యుద్ధ ఉన్మాదంతో పాలస్తీన దేశంపై వైమానిక దాడులు చేస్తూ ఆ దేశ ప్రజల హనానికి పాల్పడుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారావు రాజేశ్వర్, శ్రీకాంత్, సహాయ కార్యదర్శి మస్తాన్, రాష్ర్ట కోశాధికారి కూతాటి రాణాప్రతాప్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేష్, నాయకులు ప్రకాష్‌రాజ్, సూర్య, అనిల్ పాల్గొన్నారు.