న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడవలసి ఉన్న ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. 8 మంది విపక్ష ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేయడం, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకి చెందిన అముద్రిత పుస్తకం నుంచి చైనాకు సంబంధించిన కొన్ని అంశాలను ఉటంకించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌సహా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం లోక్‌సభలో అలజడి సృష్టించారు.
వాయిదా అనంతరం సాయంత్రం 5 గంటలకు సభా కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగానే ప్రధాని మోదీ ఇక ప్రసంగిస్తారని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా వర్షా గైక్వాడ్, జ్యోతిమణిసహా విపక్షానికి చెందిన కొందరు మహిళా ఎంపీలు మోదీతోసహా అధికార పక్షానికి చెందిన ఎంపీల సీట్లను అడ్డుకున్నారు. ‘ఏది సరైనదో అదే చేయండి’ అన్న అక్షరాలు రాసిన పెద్ద బ్యానర్‌ను పట్టుకుని వారు నిరసన తెలిపారు. 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను వారు తీవ్రంగా ఖండించారు. ఇంతలో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను వాయిదా వేశారు. కాగా, ప్రధాని మోదీపై మహిళా ఎంపీలు దాడి చేసి ఉండేవారని బీజేపీకి చెందిన మనోజ్ తివారీ ఆ తర్వాత వ్యాఖ్యానించడం గమనార్హం. జరిగిన ఘటన చాలా భయంకరమైనది.
కాంగ్రెస్ నిస్పృహకు ఇది పరాకాష్ఠ. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మహిళా ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. కిరణ్ రిజిజు వెంటనే ఆలోచించబట్టే పరిస్థితి అదుపులోకి వచ్చింది అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ప్రసంగం రద్దు కావడంతో గురువారం దీనిపై చర్చ కొనసాగనున్నది. ధన్యవాదాల తీర్మానానికి లోక్‌సభ ఆమోదం ఇంకా పొందవలసి ఉంది. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత మోదీ ప్రసంగించే అవకాశం ఉన్నది.
దూబే వ్యాఖ్యలపై దుమారం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌సభలో బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే చేసిన అనుచిత వ్యాఖ్యలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీపై సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దూబేపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండు చేశారు. విపక్ష ఎంపీలు తమ ఫిర్యాదును లిఖితపూర్వకంగా ఇవ్వాలని, ఆ తర్వాత దాన్ని తాను పరిశీలిస్తానంటూ స్పీకర్ ఓం బిర్లా విపక్ష ఎంపీలకు సూచించినట్లు వర్గాలు తెలిపాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది.
హలో మిత్రద్రోహి… హాయ్ దేశద్రోహి
పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్, బీజేపీ ఎంపీ లడాయి
లోక్‌సభ ప్రాంగణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. అతడిని రాహుల్ ‘మిత్ర ద్రోహి’ అని పిలువగా, బదులుగా అతను దేశ ద్రోహి అంటూ రాహుల్‌ను నిందించారు. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ రాహుల్, పార్లమెంట్ నుంచి సస్పెండైన 8 మంది ఎంపీలతో కలిసి ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో ఆ వైపుగా వెళ్తున్న బీజేపీ ఎంపీ బిట్టూ ‘వారు (సస్పెండైన ఎంపీలు) ఏదో యుద్ధం గెలిచినట్టుగా ఇక్కడ కూర్చున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. దానికి సమాధానంగా రాహుల్ స్పందిస్తూ ‘విషయం ఏమిటంటే ఇక్కడ ఒక ద్రోహి అటుగా నడుస్తున్నాడు. అతడి ముఖం చూడండి.. ఎలా చూస్తున్నాడో’ అంటూ వ్యాఖ్యానించడమే కాక, బిట్టూతో కరచాలనం కోసం తన చేతులు చాచి ‘హలో సోదరా.. నా మిత్ర ద్రోహి.. బాధపడకు.. నీవు త్వరలోనే వెనుకకు (కాంగ్రెస్‌కు) వస్తావులే’ అని పేర్కొన్నారు. అయితే ఆయనతో కరచాలనం చేయడానికి నిరాకరించిన బిట్టూ రాహుల్‌నే ‘దేశ ద్రోహి’ అంటూ నిందించారు.