Chandrahas | బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన తొలి సినిమా నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. మొదటి సినిమా విడుదలకు ముందే ఒక స్టేజ్ ఈవెంట్లో అతను ప్రవర్తించిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో “యాటిట్యూడ్ స్టార్” అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. ఆ సమయంలో చంద్రహాస్‌కు సంబంధించిన వీడియోలు మీమ్ పేజీల్లో విస్తృతంగా వైరల్ కాగా, విమర్శలు వచ్చినప్పటికీ అతను ఎక్కడా వెనక్కి తగ్గకుండా “నేను ఇలానే ఉంటా” అన్న ధోరణితో ముందుకు సాగాడు. ఇప్పటికే వివాదాల మధ్య కెరీర్ కొనసాగిస్తున్న చంద్రహాస్, తాజాగా నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడిన “గుంజి గుంజి” పాటతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు.
ఈ పాటలో ఉపయోగించిన పదజాలం, బూతులపై రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ పాటను తీవ్రంగా విమర్శిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై చంద్రహాస్ ఓ వీడియో విడుదల చేసి స్పందించాడు. తాను క్షమాపణ చెప్పలేదనే విమర్శలు వస్తున్నప్పటికీ, ఆ వీడియోలో తనపై గతంలో కూడా తీవ్ర విమర్శలు, బూతులు వచ్చాయని కానీ వాటిని క్రిటిసిజంలా తీసుకున్నానని తెలిపాడు. పాటలో వినిపించిన బూతులు ఒరిజినల్ సాంగ్‌లో లేవని, ఇంపాక్ట్ కోసం తానే సృష్టించానని వెల్లడించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ పాటకు ప్రేక్షకుల నుంచి చప్పట్లు వచ్చాయని కూడా చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు అశోక్ వేములపల్లి గట్టిగా స్పందిస్తూ ఆ పాటలోని పదజాలాన్ని ప్రశ్నించారు. దీనిపై చంద్రహాస్ మరింత తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు. తన కుటుంబాన్ని ప్రస్తావించారని ఆరోపిస్తూ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. “సారీ చెప్పకపోతే లాయర్లతో మాట్లాడుతున్నాను” అంటూ హెచ్చరికలు జారీ చేయడం మరింత వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై అశోక్ వేములపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుల్లితెర మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాకర్ వారసుడిగా చంద్రహాస్ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా పరిచయమైన అతను, సినిమాల కంటే ముందే తన ప్రవర్తనతో “యాటిట్యూడ్ స్టార్” అనే ఇమేజ్ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు “గుంజి గుంజి” పాట వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచిన చంద్రహాస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.