హనుమకొండ చౌరస్తా, జనవరి 9: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండప పైకప్పు నీటి పారుదలను అందించడం కోసం 2వ దశ కళ్యాణ మండప పనులు శంకుస్థాపన జరిగింది. రూ.32 లక్షలతో పనులు ప్రారంభించేందుకు శుక్రవారం కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణచైతన్య, కన్జర్వేషన్ అసిస్టెంట్ ఎం.మల్లేశం, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ఎంఎస్ అజిత్, నిట్ ప్రొఫెసర్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇంటెక్ కన్వీనర్ పాండు రంగారావుతో కలిసి పనులు ప్రారంభించారు. కళ్యాణ మండపం పునరుద్ధరణ పనుల్లో భాగంగా కళ్యాణ మండపానికి వాటర్ ప్రూఫింగ్ పనులకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులతో వేదపండితులు గంగు మణికంఠశర్మ పూజలు చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ నిఖిల్దాస్ మాట్లాడుతూ భారత పురావస్తు సర్వే సంస్థ(ఏఎస్సై) ఆధ్వర్యంలో వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండపం మొదటి దశ పనులు పూర్తయినట్లు, రెండవ దశ పనులు కళ్యాణ మండపం పైన వాటర్ ఫ్రూఫింగ్ పనుల కోసం రూ.32 లక్షలు మంజూరైనట్లు, ఈ పనులు పూర్తయిన మూడోదశ పనులు రూ.5 కోట్లతో కల్యాణ మండప దక్షిణ భాగాన్ని తిరిగి అమర్చే పనిని చేపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత ప్రాజెక్ట్ రూ.32 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ప్రూఫింగ్ కోసం చేపట్టబడుతోందని, మూడు నెలల్లో పనులు పూర్తవుతుందని ఆయన చెప్పారు