బచ్చన్నపేట జూన్ 26 : ప్రతి ఊరు, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూప రాణి సూచించారు. శుక్రవారం బచ్చన్నపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్య సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పైప్ లైన్ లీకేజీలు లేకుండా అరికట్టాలని సూచించారు. ట్యాంకులను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలన్నారు.
తడి పొడి చెత్త ప్రతిరోజు ప్రజలు వేరుచేసి పంచాయతీ ట్రాక్టర్కు అందించాలన్నారు. ప్రతిరోజు పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లకి వెళ్లి పర్యవేక్షణ జరపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా ప్రతి ఊరు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసే బాధ్యత పంచాయతీ కార్యదర్శుల మీద ఉందన్నారు. అనంతరం అంజయ్య నగర్ లోని గణపురం కవిత అంగన్వాడి సెంటర్ ను, ప్రాథమిక పాఠశాలను, సబ్ సెంటర్ ను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో డి ఎల్ పి ఓ వెంకటరెడ్డి, ఎంపీడీవో మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.