అడగకుండానే.. అందరి సమస్యలు తానే తెలుసుకొని.. ఒక్కో సమస్యను తీర్చుకుంటూ వచ్చిన నాయకుడిని కాదని..అదేదో ‘మార్పు’ అని తెలియని బ్రహ్మపదార్థం కోసం కొరివిని తెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటే తల తగలబడిపోతున్నది. దళితులకు భూములు కాదు కదా.. ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్పష్టంగా తేల్చి చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన దళితులను ఆదుకోవడానికి 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నది. దళితుల కోసం మూడెకరాల భూమి ఇవ్వాలని తెలంగాణ సాధకుడు కేసీఆర్ సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా అనేక ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేసి కొందరికి పంచి ఇచ్చారు. దాదాపు 16 వేల ఎకరాల భూమిని సుమారు 7 వేల దళిత కుటుంబాలకు పంచిపెట్టారు. కానీ, పలుచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో దానికి సమర్థమైన ప్రత్యామ్నాయాన్ని కూడా ఎవరూ అడగకుండానే కేసీఆర్ సంకల్పించారు.
దళిత బంధు పథకాన్ని అద్భుతంగా రూపకల్పన చేసి ప్రజలకు అందించారు. దళితులపై ఎలాంటి భారం లేకుండా రూ.10 లక్షలకు దళిత కుటుంబమే ఓనర్ అయ్యే విధంగా పథకాన్ని రూపొందించారు.
పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రకటించడానికి ముందు.. దళితబంధు అనే పేరును ఖరారు చేయడానికి ముందే బడ్జెట్లో దళిత సాధికార పథకం పేరుతో ప్రాథమికంగా రూ.1,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరతో పాటు 4 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లోని దళితులకు ముందుగా ఈ పథకాన్ని వర్తింపజేశారు. వాసాలమర్రిలో కూడా ఈ పథకాన్ని అమలు చేశారు.
కేసీఆర్ అంతటితోనే సరిపెట్టలేదు. ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల్లో, జారీ చేసే ఎక్సైజ్ లైసెన్సుల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించి ఆర్థికంగా ఆ సమాజం స్వయం సమృద్ధి చెందడానికి చక్కని బాటలు వేసుకుంటూ వచ్చారు. కానీ, నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి సహా ఈ స్కీమును నానా రకాలుగా విమర్శించి లేనిపోని అపోహలు సృష్టించారు.
అసెంబ్లీ ఎన్నికలు ముం చుకొచ్చేసరికి దళితబంధు పథకాన్ని తాము మరింత చక్కగా అభివృద్ధి చేస్తామని నమ్మబలికారు. దళితులకు భూములు పంచుతామంటూ ఊదరగొట్టారు. కేసీఆర్ రూ.10 లక్షలు ఇస్తే.. తాము రూ.12 లక్షలు ఇస్తామంటూ హడావుడి చేశారు. నిన్నటికి నిన్న సంత్ సేవాలాల్ నివాళి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పిన విషయమేమంటే.. దళితులకు ఇవ్వడానికి తమ దగ్గర భూములే లేవని, భూములు కావాలంటూ తమను అడగనే వద్దని తేల్చి చెప్పారు. కేవలం భూముల పంపకం విషయంలో మాత్రమే ఈ మాట అని ఊరుకోలేదు. ప్రభుత్వం నుంచి ఇకపై ఎలాంటి సంక్షేమాన్ని దళితులు ఆశించనే వద్దని క్రిస్టల్ క్లియర్‌గా తేల్చి చెప్పారు. దళిత బంధుకు కేసీఆర్ రూ.10 లక్షలు ఇస్తే, తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పలికిన బీరాలన్నీ.. గోదాట్లో కొట్టుకుపోయినట్టేనని తేలిపోయింది.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా.. వివిధ వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఒక్కో పథకాన్ని చెత్త బుట్టలో పారేస్తూ వస్తున్నారు. రైతుబంధు ఒక సీజన్‌కు సరిపెట్టారు. అది కూడా సీజన్‌కు ఏడున్నర వేలు ఇస్తామని చెప్పి ఆరు వేలు ఇచ్చారు. అందులోనూ సగం మంది రైతులకు ఎగ్గొట్టారు. రైతు బీమా ఏమైందో తెలియదు. ఆసరా పింఛన్ల సంగతి సరే సరి. ఓవర్సీస్ విద్యానిధి పథకాలు మూలనపడ్డాయి. కాంట్రాక్టులు..కమీషన్లు తప్ప మరేదీ పట్టని దుస్థితి నెలకొన్నది. ఇప్పుడు తెలంగాణలో అత్యంత వెనుకబడిన దళితుల నోట్లో మన్ను కొడుతున్నారు. ఇదేనా ప్రజలకు కాంగ్రెస్ చూపిస్తామన్న మార్పు..? తెచ్చిన మార్పు?
– కోవెల సంతోష్ కుమార్