పరస్పర విరుద్ధం. నక్కకు నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం. కాకతాళీయమో.. మరేంటో గానీ.. ప్రత్యక్ష సాక్షీభూతం. రాష్ట్రమంతా చూసిన నిష్ఠూర సత్యం. బంధాలు వెతుక్కుంటూ వెళ్లిన సుందర దృశ్యాలు ఒకవైపు.. వెక్కివెక్కి ఏడుస్తూ బాధను దిగమింగుకున్న బందీల చిత్రాలు మరోవైపు. ప్రజానేతను కలిసేందుకు పరుగులు తీసిన జనసందోహం ఇటు.., జనతీర్పును కుర్చీలాటలో పలుచన చేసిన తీరును ప్రశ్నించిన వారిని ఉరికిచ్చి కొట్టిన ఖాకీ కర్రల స్తైరవిహారం అటు. రాజకీయం నాటకీయంగా మారి.. ప్రజల ఇష్టాన్ని ఇనుప చువ్వల్లో బంధించిన తీరు హాస్యాస్పదం.. ఆలోచించాల్సిన సందర్భం.
ఒకవైపు ప్రజానేత, తెలంగాణ జాతిపిత. రాష్ట్ర సాధన కార్యదక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా తెలంగాణవాసి నివాసం ఏర్పర్చుకున్న ప్రతి గల్లీలో జరుపుకుంటున్న వేళ.. మున్సిపల్ పీఠాల కైవసానికి ‘చేతి’వాటం ప్రదర్శించిన అధికార దర్పం మరోవైపు వికటాట్టహాసం చేసిన తీరు గర్హనీయం. రెండేండ్ల రెఫరెండంగా భావించారో.. మూడేండ్లు ముందున్నదనే తెగించారోగానీ యంత్రాంగమంతా ఒక్కతాటిపైకి వచ్చింది.. చేయిచేయి కలిపింది.. చేతనైనంతా శ్రమించింది..సాధ్యమైనన్ని కుర్చీలు ‘చే’జిక్కేలా చేసుకున్నది. తెరవెనుక ఆదేశాలైతేనేం.. తెరముందు బలప్రదర్శన చేయడమైతేనేం.. చేయాల్సింది చేసి.. రచ్చ రచన చేసిన భయానక చిత్రాల పరంపర గత కొద్దిరోజులుగా రాష్ట్రమంతా ఎక్కడ చూసినా లెక్కకు మిక్కిలే.
రాష్ర్టానికి ప్రజాపాలనను అలవాటు చేస్తామని చెప్పి ఆట మొదలుపెట్టిన రేవంత్ బలగం ఇప్పుడు ఏ రకపు పాలనకు తెర తీస్తున్నట్టో తేలిపోతున్నది. తెలిసిపోతున్నది. సంఖ్యా బల నిరూపణలో అడ్డగోలు కొనుగోళ్ల లావాదేవీల్లో అంతర్గతంగా ఆగమాగమై, అనుకున్నట్టుగా కూడబెట్టుకున్న లెక్కలను మాత్రం బహిర్గతం చేసేందుకు యావత్తు రాష్ట్ర పాలకులు, యంత్రాంగం పడిన శ్రమను ఏ రకమైన రూలింగ్గా భావించాలో ఏలికలకే తెలియాలి. మున్సిపాలిటీల్లో మురుగు, కార్పొరేషన్లలో కంపు కార్యాలకు తెరతీసి, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ లాక్కోవడాలు, నిర్బంధించడాలు చేస్తూ మూట గట్టుకున్న మకిలికి ఏ పేరు పెడుతారో వాళ్లే సెలవియ్యాలి.
ప్రజా బలం కూడగట్టడం వేరు, ఇతరుల బలాన్ని లాక్కోవడానికి మందీమార్బలంతో కూడబలుక్కోవడం వేరు. న్యాయంగా గెలిచిన వాటిని దక్కించుకునే అర్హతను నీళ్లపాలు చేసి, అన్యాయంగా హస్తగతం చేసుకోవడం అతి సాధారణమైంది.
ఇవ్వాళ ఉన్నది మేమే, అందుకే ఇటువైపు రావాల్సిందే, రేపటి నుంచి మాతో నడవాల్సిందే.. అని హుకుం జారీ చేసి పర బలాన్ని తమ బలంగా మలుచుకున్న తీరులో ఆర్థిక వ్యవహారాలు. భయాందోళనకు తీసిన తెరలతో నడిపిన పీఠాల పితలాటకాన్ని రాష్ట్రం చూసింది.
ప్రలోభపర్వాలు, ఓట్ల కొనుగోళ్ల వ్యవహారంతో కలుషితం చేసిన ఘనాపాఠి క్రతువు వర్థిల్లుతున్న ఎన్నికలస్వామ్యంలో వారంతట వారుగా ఇచ్చిన తీర్పును సైతం మళ్లీ కొనుగోలు, అమ్మకాల బేరాల్లో ముంచి సీట్ల సర్దుబాట్లు చేసుకుంటున్న తీరులో ఓట్లెందుకు.. గెలుపోటములు దేనికి? ఎన్నికల ముందు పార్టీల బలాబలాలు ఇవి అనే లెక్కలు వల్లెవేయాల్సిన అవసరం ఏమున్నది?
‘మీకిన్ని..మాకిన్ని అని, లేదంటే అధికారంలో ఉన్నది మేమే కాబట్టి అంతా మాదే’ అన్నట్టుగా ప్రజలను ఓ మూలన కూర్చోబెట్టి అంతా తమదే.. అని ప్రకటించుకుంటే పోయేది ఏమున్నది! ఆ మాత్రం దానికి అన్నేసి ఖర్చులు, ఎందరెందరో అన్నన్ని కష్టాలు పడడం ఎందుకు? పెట్టెల్లో రహస్యంగా నిక్షిప్తమయ్యే తీర్పును లెక్క చేయకుండా, ముందే ప్రణాళిక రచన చేసి అంతా తమదే, అన్నీ తమ వైపే అన్నట్టుగా తెగింపు చూపిన కాంగ్రెస్ సర్కార్ విన్యాసం మున్సిబ్లోని పరమ కార్పొరేట్ పాలనే.
జనమంతా జననేత కోసం పరుగులు తీస్తున్న తరుణంలో రోడ్లపై ఓ వైపు ఉత్సవ వాతావరణం, కుర్చీలు లాగే తీరుతో మరోవైపు ఉద్రిక్త వాతావరణం. ఇచ్చిన తీర్పును మార్చే అవకాశం చేతిలో ఉండొచ్చుగానీ, నచ్చిన నాయకుడి వైపు ఉండే ప్రజలను నిలువరించడం ఎవరి చేతిలో లేదని చెప్పడానికి ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరిగిన అట్టహాసపు వేడుకలే నిదర్శనం. సాధింపులు.. వేధింపుల పర్వాలు తాత్కాలికమే, సాధించిన ఘనకీర్తే శాశ్వతం అనే ముచ్చట మరిచి.. తోచింది చేస్తూ, నచ్చినట్టుగా నడుస్తామనే రీతిగా సాగుతున్న కాంగ్రెస్ పాలనకు అంటుకున్న మరకలు ఎప్పటికీ చెరిగిపోవనేది ఎంతటి నిష్ఠూర సత్యమో..ఎంతో చేసిన నేతకు మరకలు పూయాలని చూసే ప్రయత్నాలు క్షణికాలే అనేది అంతకు మించిన కఠోర వాస్తవం.
గుండెల్లో పెట్టుకున్న నాయకుడిని కనబడకుండా దాచేయడం సాధ్యమయ్యేనా, తొక్కుతూ నడిచే వారిని హత్తుకుని తోడు నిలవడం జరిగే పనేనా? రాజకీయ క్రీడను వికృతంగా మలిచేందుకు పాలకులు చేసే యత్నంలో వందో వంతైనా జనశ్రేయస్సుపై పెడితే కొందరితోనైనా శభాష్ అనిపించుకోవచ్చు కదా! ప్రజానేతను రాచి రంపాన పెట్టాలని చూడటమే దినచర్యలో ఆఖరి పేజీలో రాయాల్సిన తరుణంలో అక్షరాలు దొరకవనే ముచ్చట గుర్తెరిగి మసులుకుంటే ప్రతికార్యం ప్రజాక్షేత్రంలో నిలిచేదిగా చేయాలనిపిస్తుంది. ఆ స్పృహ ప్రతిక్షణం వెంటాడుతూ హెచ్చరిస్తుంది. చూద్దాం…మూడొద్దుల ముచ్చటగా నిలుస్తారో.. మిగతా మూడేండ్లను మలుచుకుంటారో…!
– రాజేంద్రప్రసాద్ చేలిక 99858 35601