మేడ్చల్, ఫిబ్రవరి 20 : పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు అకాడమిక్-పరిశ్రమ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా గుండ్లపోచంపల్లి డివిజన్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ముందుడుగు వేసింది. ప్రపంచ శ్రేణి సాంకేతిక, ఐటీ సంస్థల ప్రతినిధులతో విశ్వవిద్యాలయంలో వ్యూహాత్మక ఎంవోయూ చేసుకుంది. విశ్వవిద్యాలయం వేదికగా గ్లోబల్ ఇండస్ట్రీ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించి, వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆపిల్ సంస్థ ప్రతినిధి హితేష్ షా, గూగుల్ ప్రతినిధి సిద్దార్గ్ ధల్వాడీ, కరణ్ తల్వార్, అమెజాన్ వెబ్ సిరీస్ ప్రతినిధి అభిషేక్ దే, ఐబీఎం అరుణా అజయ్‌కుమార్, ఓరాకిల్ కార్పొరేషన్ కృష్ణమూర్తి, ఇంటెల్ ఉత్తేజ్ అశోక్, అడ్వాన్స్ మెకానికల్ ప్రైవేట్ లిమిటెడ్ ధనేష్ నారాయణ్, ఏఎంఎస్ సింధు, రాజీవ్ ధావన్, టీసీఎస్ ప్రతినిధి పృథ్వీరాజ్ 20కి పైచిలుకు.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు గ్లోబల్ పార్టనర్షిప్ సమ్మిట్‌కు హాజరై, మల్లారెడ్డితో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు.
గ్లోబల్ ఇండస్ట్ట్రీ పార్టనర్షిప్ సమ్మిట్ ద్వారా ప్రముఖ సంస్థలతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకోవడం భవిష్యత్‌లో కీలక అడుగుగా మారనుందని విశ్వవిద్యాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గ్లోబల్ ఇండిస్ట్ట్రీ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే విద్యార్థులను పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న యూనివర్సిటీ ప్రముఖ సంస్థల భాగస్వామ్య ఒప్పందంతో ముందడుగు వేసిందన్నారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ భద్రారెడ్డి, కార్యదర్శి మహేందర్ రెడ్డి, ప్రో చాన్సలర్ శాలినీ రెడ్డి, డైరెక్టర్ ప్రీతిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, వైస్ చాన్సలర్ వీఎస్కే రెడ్డి, సీటీవో శ్రీనివాస్ రెడ్డి, హెనోటిక్ గ్రూపు సీఈవో మల్లేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాస రావు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ నేమని సుభాష్ తదతరులు పాల్గొన్నారు.