తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘట్టం. పారదర్శకత పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూరియా బుకింగ్ యాప్’ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అన్నదాతల పాలిట యమపాశంగా మారింది. పంట తొలి దశలో అత్యంత కీలకమైన యూరియా పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు సాగు రంగాన్ని కుదేలు చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. వరి, మక్క వంటి పంటలు ఇప్పుడు పూత, కాత దశకు చేరుకున్నాయి. కంకి బలంగా రావాలన్నా, గింజ గట్టి పడాలన్నా ఈ సమయంలో నత్రజని (యూరియా) అందించడం తప్పనిసరి. కానీ, రైతులు ఫెర్టిలైజర్ షాపుల దగ్గరకు వెళ్తే అధికారులు, డీలర్లు ‘యాప్’ మంత్రం జపిస్తున్నారు.
ప్రభుత్వం యూరియా పంపిణీని యాప్ పరిధిలోకి తీసుకురావడంతో, అందులో స్టాక్ ఉంటేనే బస్తా ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దురదృష్టవశాత్తు కొన్ని రోజులుగా ఈ యాప్‌లలో స్టాక్ నిల్వలు ‘జీరో’ అని చూపిస్తున్నాయి. ఎక్కడో ఓ చోట గోడౌన్లలో బస్తాలు ఉన్నప్పటికీ, యాప్‌లో పర్మిషన్ లేదనే సాకుతో రైతులకు ఎరువులు ఇవ్వడానికి డీలర్లు నిరాకరిస్తున్నారు.
ఈ జాప్యం వల్ల పంట ఎదుగుదల ఆగిపోయి, దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది రైతులకు స్మార్ట్‌ఫోన్ వాడటం తెలియదు. ఇప్పటికీ ఎంతోమంది సాధారణ ఫోన్లు వాడుతూ, కేవలం ఫోన్ కాల్స్‌కే పరిమితమయ్యే అన్నదాతలపై ఈ ‘డిజిటల్ బుకింగ్’ భారం మోపడం ఎంతవరకు సమంజసం? కాంస్ పాలలు తమ అసమర్థతను దాచుకోవడానికి సాంకేతికతను ఒక సాకుగా వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రతి రైతు దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటుందని భావించడం అవివేకమే అవుతుంది. ఒకవేళ ఫోన్ ఉన్నా, సర్వర్ డౌన్ సమస్యలు, నెట్వర్క్ ఇబ్బందులు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుకింగ్ కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగలేక రైతు తన సాగు పనులను వదులుకోవాల్సి వస్తున్నది. సామాన్యుడికి టెక్నాలజీ వెసులుబాటు కల్పించాలి కానీ, అతన్ని ఇబ్బందులపాలు చేసే సంకెళ్లుగా మారకూడదు.
రైతులు ఇప్పటికే విత్తనాలు, దుక్కులు, కూలీలు, పురుగు మం దుల కోసం వేలల్లో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. ఈ దశలో యూరియా అందకపోతే ఆ పెట్టుబడి అంతా వృథా అయ్యే దుస్థితి కనిపిస్తున్నది. చాలాచోట్ల రైతులు ఎరువుల కోసం అర్ధరాత్రి నుంచే ఫెర్టిలైజర్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎండలో గంటల తరబడి నిల్చున్నా, చివరకు యాప్ సమస్య అని చెప్పి ఖాళీ చేతులతో వెనక్కి పంపడం రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. ఇది కేవలం ఒక బస్తా ఎరువు సమస్య కాదు, ఒక కుటుంబం జీవనాధార సమస్య. ప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితిని గమనించకుండా కేవలం డిజిటల్ లెక్కలకే పరిమితమైతే, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎరువుల కోసం రోడ్లపైకి వస్తున్న రైతులను చూస్తుంటే పాలకుల పరిస్థితి చేయి దాటుతున్నదని అర్థమవుతున్నది. ఓట్ల కోసం పథకాలు ప్రకటించడం కాదు, సాగుకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించడమే అసలైన రైతు పక్షపాతమని అన్నదాతలు గుర్తు చేస్తున్నారు. ఈ అసంతృప్తి, ఱెగహంతో రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. రైతు కన్నీటిపై అధికారం నిలబడదని పాలకులు గుర్తెరగాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడాలి. రైతుకు కావాల్సింది ఎరువు, యాప్‌లో అంకెలు కాదు. పాత పద్ధతిలోనే ఫెర్టిలైజర్ డీలర్ల వద్ద, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా నేరుగా యూరియా అందేలా చూడాలి. ప్రతి మండలం, జిల్లా కేంద్రంలో నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొరత రాకుండా ముందుగానే అంచనా వేసి సరఫరా పెంచాలి. ప్రభుత్వ యంత్రాంగం కేవలం పర్యవేక్షణకు పరిమితమై, రైతు సహకార సంఘాల ద్వారా పంపిణీని వేగవంతం చేయాలి. రైతు కన్నీళ్లు తుడవడానికి టెక్నాలజీ ఉపయోగపడాలి కానీ, కన్నీళ్లు పెట్టించడానికి కాదని ప్రభుత్వం గ్రహించాలి.
రైతన్న ఇప్పుడు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నాడు. ఒకవైపు ప్రకృతితో పోరాటం, మరోవైపు ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ సాంకేతిక అడ్డంకులు వేధిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ‘యాప్’ విధానాన్ని రద్దు చేసి, రైతులకు అండగా నిలువాలి. యూరియా కొరతను తీర్చి సాగును రక్షించకపోతే సామాన్యుడికి మెతుకు కరువయ్యే రోజు వస్తుంది. ఇప్పటికైనా యాప్ విధానాన్ని పక్కన పెట్టి, తమ గుండెల్లో ధైర్యాన్ని నింపేలా ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని యావత్తు తెలంగాణ రైతాంగం డిమాండ్ చేస్తున్నది.
– వెంకగారి భూమయ్య 9848559863