– సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్
రుద్రంపూర్, మే 30 : రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, ఆస్పత్రిని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబాలతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఈ వైద్యశాల ఎంతో కాలంగా వైద్య సేవలు అందిస్తోందని, ఈ ఆస్పత్రిలో కొత్త వైద్యుల నియామకం చేపట్టకుండా, కేవలం ఇద్దరు స్టాఫ్‌తో మందులు ఇచ్చేలా యాజమాన్యం కుట్రపూరితంగా మార్చిందని మండిపడ్డారు.
ఇక్కడ పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ పొందడంతో, కొత్తవారిని నియమించకుండా ఆస్పత్రిని ఏకంగా సీల్ చేయడం సరైంది కాదన్నారు. ఈ ఆస్పత్రిని మూసివేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలు చిన్నపాటి వైద్య సేవలకు సైతం సుదూర ప్రాంతంలోని ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర భారంగా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం మొండివైఖరి వీడి తక్షణమే ఇక్కడ వైద్యులను, సిబ్బందిని నియమించి ఆస్పత్రిని యధావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.