DK Shivakumar : కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar) బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. శనివారం విధాన సభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) మద్దతు తెలపగా.. పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు శివకుమార్‌ను ఏకగీవ్రంగా సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. దాంతో, రాజ్యాంగం ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్టీ ఆమోద ముద్ర వేసింది.
గత కొన్ని రోజులుగా కర్నాటకలో నాయకత్వ మార్పు వార్తలు నిజమవ్వబోతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి పదవి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఇన్నాళ్లు డిప్యూటీగా కొనసాగిన డీకే శివకుమార్ సీఎం కల సాకారమవ్వనుంది. శనివారం విధాన సభ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో డీకే సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. అయితే.. అంతుకుముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
#WATCH | Bengaluru, Karnataka: Congress general secretary (organisation) KC Venugopal says, “Congress high command suggested the name of DK Shivakumar as the leader of Congress Legislative Party. Siddaramaiah ji proposed the name of DK Shivakumar as the new leader of the… pic.twitter.com/MPJtk4JZxo
— ANI (@ANI) May 30, 2026
తదుపరి సీఎంగా డీకే శివకుమార్ పేరు ఖరారైనప్పటికీ.. సీఎల్పీ నేతను అధిష్ఠానం ఎంపిక చేస్తుందని సిద్ధరామయ్య చెప్పడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ కేంద్ర పరిశీలకులు రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్(KC Venugopal) 10 నిమిషాల విరామం అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లారు. సీనియర్ నాయకులు పరమేశ్వర ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రకటించారు.
శివకుమార్‌కు సిద్ధరామయ్య మద్దతు తెలపగా అందరూ ఆమోదించారు. తర్వాత సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు చెప్పిన శివకుమార్.. ఆయనతో పాటు గవర్నర్ థవరాచంద్ గెహ్లోట్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. గవర్నర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చాక డీకే శివకుమార్, ఆయన బృందం జూన్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.