హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో(జేఎన్ఎస్) స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఏర్పాటు కోసం ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వసతులను పరిశీలించారు. ఈ సందర్బంగా స్టేడియం ఆవరణలో ఉన్న హాస్టల్ భవనాలు, ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా మైదానాలను పరిశీలించి చేపట్టాల్సిన మరమ్మతులు, కల్పించాల్సిన సదుపాయాలను అధికారులకు సూచించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్ స్టేడియంలో వసతి సౌకర్యాలపై వారికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ ఆగస్టు నుంచే స్పోర్ట్స్స్కూల్ తాత్కాలిక ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్స్కూల్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు.
బీసీసీఐని సంప్రదించి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి నిధులు, స్పోర్ట్స్ స్కూల్ కంసెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్స్అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజిజ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.