హనుమకొండ చౌరస్తా, జులై 31: సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సఖి కేంద్రాల ఏర్పాటును చేపట్టిందని, మహిళల రక్షణకు ఇదొక శక్తివంతమైన కేంద్రమని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 6వ డివిజన్ లష్కర్బజార్లో నూతనంగా నిర్మాణం చేసిన సఖి కేంద్రాన్ని(సఖి వన్ స్టాప్ సెంటర్)ను ఎమ్మెల్యేలు మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సఖి సెంటర్లో మహిళలకు మానసిక, శారీరక, న్యాయసహాయం ఒకేచోట అందించబడుతుందని, మహిళలు సఖి కేంద్రాన్ని ధైర్యంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే, సిబ్బందిని అభినందించారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో రాజీ పడదన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో అన్నివిధాలుగా అనుకూల వాతావరణంలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జయంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.