హనుమకొండ చౌరస్తా, జూలై 21: ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షులు మాలోతు చిట్టిబాబు నాయక్, గోర్ సిక్వాడి మీడియా వింగ్ అధ్యక్షులు బాదావత్ బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు. గోర్ సిక్వాడి, గోర్ సేన భారత్, తెలంగాణ కమిటీల పిలుపుమేరకు ప్రెస్‌క్లబ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలోతు చిట్టిబాబునాయక్ మాట్లాడుతూ దేశంలోని సుమారు 12 కోట్ల మంది సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పండగను అన్ని తండాలలో, నగరాలలో ఘనంగా జరుపుకోవాలని, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తీజ్ పండగ నాడు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బాదావత్ బాలాజీనాయక్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోర్ బంజారాలు శ్రావణమాసం ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తీజ్ పండుగ అనేది సింధు నాగరికతకు ముందు నుండే బంజారాల వారసత్వ సంపదగా వస్తోందన్నారు. తొమ్మిది రోజులపాటు గోధుమ మొక్కలకు పెళ్లికాని యువతులు నీరు పోస్తూ, గోధుమగడ్డి ఏపుగా పెరిగితే పంటలు కూడా అదేవిధంగా బాగా పండుతాయని నమ్ముతారని చెప్పారు.
చివరి రోజున సేవాల్ మహారాజ్ కు భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించి, మేరమా యాడికి పూజలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు సబావట్ మహేందర్‌నాయక్, భూక్య రవి నాయక్, చంద్రు తండా సర్పంచ్ విజయ్ నాయక్, దేవేందర్ నాయక్, వెంకన్ననాయక్, శ్రీధర్ నాయక్, నాగమణి బాయి సోనాబాయి, అనూషబాయి, గోర్‌సేన నాయకులు పాల్గొన్నారు.