ఏటూరునాగారం : పశువుల యజమానులు వాటిని ఇండ్లలో కట్టేసుకోకుండా వదిలేయడంతో రోడ్లు, పాఠశాల ఆవరణలో చేరి చిత్తడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మైదానంలో నిత్యం వాకింగ్ చేసే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వైపు నిత్యం రోడ్లపై పశువులు ఉండడంతో వాహనదారులు, పాదచార్లు ఇబ్బందులకు గురవుతు న్నారు. పశువుల యాజమానూలు వాటిని ఇండ్లలో కట్టెయ్యకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటు తెరిచి ఉండడంతో సుమారు 40 పైగా పశువులు స్కూల్ పరిసరాలను అపరిశుభ్రం చేశాయి. ఓవైపు వర్షం కురుస్తుండగా మరోవైపు పేడ, మూత్రంతో పరిసరాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. క్రీడ మైదానంలో పశువులు చేరి గడ్డి మేస్తుండడంతో పాటు అక్కడే పడుకున్నాయి. దీంతో వాటి వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు. పశువుల యజమానులు వాటిని ఇళ్లల్లో కట్టించుకునే విధంగా అధికారులు ఆదేశాలు జారీ చేసి రోడ్లపై పశువులు ఉండకుండా చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. పశువులు రోడ్లపై ఉండడంవల్ల రాత్రివేళ అనేకసార్లు ప్రమాదాలు జరిగి గాయపడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. పశువుల యజమానులు వాటిని తమ ఇండ్లలో కట్టేసుకునే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.