హనుమకొండ, జులై 04: నెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన సమ్మెకు వామపక్ష పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ, ఆర్ఎస్పీ పార్టీల జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి ఎనిమిది గంటల పని విధానాన్ని ఎత్తివేయడంతో పాటు కార్మికుల సమ్మె హక్కులను కాలరాసే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం సరికాదని అన్నారు. లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు కలిసి రావాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..గత మూడున్నర దశాబ్దాలలో కేంద్రంలో పాలక వర్గాలు కార్మిక హక్కులపై ఏదో ఒక స్థాయిలో దాడి చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలకు పూర్తి మెజారిటీ లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న బూర్జువా పార్టీల సహకారంతో కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల అమలుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించే నయా ఉదారవాద విధానాలను ప్రతిఘటిస్తూ అప్రజాస్వామికంగా తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకై 2025 జూలై 9న కార్మికవర్గం మరో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమైందని, ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరించే కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెతో సహా పెద్దఎత్తున దేశవ్యాప్త ఉద్యమానికి10 కేంద్ర కార్మిక సంఘాలతో పాటు రాష్ర్ట కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ర్ట సమితి సభ్యుడు ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, సీపీఎం జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, ఎం. చుక్కయ్య, గొడుగు వెంకట్, న్యూడెమొక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు, నున్నా అప్పారావు, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కౌడగాని శివాజీ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రె లక్ష్మణ్, మునగాల బిక్షపతి, కొట్టెపాక రవి, బత్తిని సదానందం, ఏదునూరి వెంకట్రాజం, మాలోతు శంకర్ నాయక్, బొట్టు బిక్షపతి, గోకల రాజయ్య, మహేందర్, పసునూరి సునిల్ తదితరులు పాల్గొన్నారు.