హనుమకొండ చౌరస్తా, జనవరి 13 : ఆర్టీసీ డిపోలలో వివిధ హోదాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని వరంగల్ రీజియన్ విశ్రాంత ఉద్యోగులు పట్టాభి లక్ష్మయ్య, పాసికంటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. 40 సంవత్సరాలుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి డిపో అభివృద్ధిలో, ఆర్టీసీ అభివృద్ధిలో సింహభాగం ఉండేవిధంగా ఆర్టీసీనీ నిలబెట్టామన్నారు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డిఫరెన్స్, 2024అక్టోబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులు, సీసీఎస్ సెటిల్మెంట్లు, ఆగస్టు 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు రావలసిన గ్రాట్యుటీ లాంటి బకాయిలు చట్టప్రకారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలోని రిటైర్డ్ ఉద్యోగులందరం అప్పులు తీరక, అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గుండెపోటుకు గురై కొందరు అకాల మరణం చెందారని, పిల్లల పెండ్లిళ్లకు, చదువులకు, అనారోగ్య కారణాల వలన చేసిన అప్పులు తీరక మానసికవేదన గురవుతూ మంచం పడుతున్నారని వాపోయారు. రావాల్సిన అన్ని రకాల బకాయిలు జీవించి ఉండగానే చెల్లించాలని, పెన్షన్‌లోని ఇబ్బందులను తొలగించాలని అధికారులను, ఎండీని కోరినప్పటికీ స్పందనలేదన్నారు.
ఈనెల 20లోగా చెల్లించకపోతే 21న బకాయిల సాధన కోసం బస్సు భవన్ వద్ద ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేపడుతామని తెలిపారు. సమావేశంలో అశోక్‌రావు, వెంకటయ్య, ఎం.ఎస్.రావు, సదానందం, గూడెల్లి బిక్షపతి, విశ్వనాథం, సోమయ్య, పెద్ది రవీందర్, శివాజీ కోటగిరి, వీరన్న, యాదగిరిస్వామి, ఎల్లయ్య, హయగ్రీవచారి, సాయిలు పాల్గొన్నారు.