హనుమకొండ చౌరస్తా, జనవరి 12 : కాకతీయ విశ్వవిద్యాలయ వసతి గృహాలు-ముల్కనూర్ ఉమెన్స్కోఆపరేటివ్ మధ్య అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కేయూ వసతి గృహాల సంచాలకు, ముల్కనూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ఉపకులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కుదిరింది. వసతి గృహాల సంచాలకులు ఎల్పీ రాజ్‌కుమార్, ముల్కనూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సంస్థ ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, నిరంజన్, మాధవరెడ్డిలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా విశ్వవిద్యాలయ వసతి గృహాలకు పాలు, పెరుగు సరఫరా చేయడానికి అవసరమైన నిబంధనలు ఖరారు చేసినట్లు రిజిస్ట్రార్ రాంచంద్రం వివరించారు. ఈ ఎంఓయూ ఒక సంవత్సరం కాలం అమల్లో ఉంటుందని, పాలు, పెరుగు ఉత్పత్తి కేంద్రాల నుంచి విశ్వవిద్యాలయ వసతి గృహాలకు నేరుగా సరఫరా చేయనున్నటు తెలిపారు. అవగాహన ఒప్పందం ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకతకు అవకాశం కలుగుతుందని, బరువు, నాణ్యత విషయంలో ఒప్పంద నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అమలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయ వసతి గృహాల చైర్మన్ ప్రొఫెసర్ టి.మనోహర్, పి.మల్లారెడ్డి, ఎన్.వాసుదేవరెడ్డి, ఆర్.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.