ఖిలావరంగల్, ఫిబ్రవరి 11 : ఖిలావరంగల్లోని ఆరేళ్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి సైక్లింగ్ క్రీడా పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన సైక్లింగ్ విభాగంలో ఆరేళ్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి జూలూరి భువన్ కుమార్ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శైలేంద్ర కుమార్ బుధవారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థి భువన్ ను అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఏ శోభారాణి, ఎం. వెంకటరమణ, పి. భాస్కర్, సిహెచ్. కిరణ్ కుమార్, కె. శ్రీధర్, ఎం.డి. యాకుబ్ పాషా, డి. తిరుపతి, ఎం.డి. సత్తార్, బి. స్వాతితో పాటు తోటి విద్యార్థులు భువన కుమార్ను అభినందించారు.