హనుమకొండ చౌరస్తా, జూన్ 8 : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ కళాశాలలలో ఎం.ఏ., ఎం.కామ్., ఎం.ఎస్ సి. నాలుగవ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న పరీక్షల నిర్వహణను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి పరిశీలించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులకు నిరంతర విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పరీక్ష సమయానికి అర్థగంట ముందుగా కళాశాలకు చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, పరీక్షల నిర్వహణ అధికారి శ్రీదేవి, స్వామి పాల్గొన్నారు.