హనుమకొండ చౌరస్తా : మెట్టుగుట్ట దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షులు మండల భూపాల్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకుడు అభిలాష్శర్మ, డిప్యూటీ కమిషనర్‌కి స్వయంగా రాసి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. భక్తుల దగ్గర నుంచి ఫోన్‌పే, గూగుల్‌పేల ద్వారా డబ్బులు తన బ్యాంకు అకౌంట్‌కు పంపించుకున్నారు.
31.5 కిలోల వెండిలో పలు లోపాలు డీసీ విచారణలో బయటపడ్డాయి. భగవంతుడి కోసం వివిధ వస్తువులు, ఆభరణాలు చేపిస్తున్నామని తీసుకున్న మొత్తం వెండిలో 15 కిలోల అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో అర్చకుడు, ఈవో శేషుభారతిపై దేవాదాయశాఖ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్లు వచ్చాయి. దాంతో ఈవో శేషుభారతిని దేవాలయ బాధ్యతల నుంచి తప్పిస్తూ కురవి వీరభద్ర స్వామి దేవస్థానం ఈవో సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
కానీ అర్చకునిపై 15 కిలోల వెండి రికవరీ, ఈవో శేషుభారతిపై చట్టప్రకారమైన కఠిన చర్యలు తీసుకోవడంలో అలసత్వం జరిగిందని మండల భూపాల్ అన్నారు. ఈ సమావేశంలో దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ర్ట అధ్యక్షుడు చీకటి రాజు, రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి నాగరాజు గౌడ్, దేవాలయాల పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ పల్లపు అశోక్, రణధీర్‌రెడ్డి, చుంచు ఆనంద్ పాల్గొన్నారు.