Theft case : మహారాష్ట్ర (Maharastra) లో 50 ఏళ్ల నాటి ఓ చోరీ కేసు (Theft case) కు ఎట్టకేలకు తెరపడింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులు, ఫిర్యాదుదారుడి కోసం పోలీసులు అనేక ఏళ్లుగా వెతుకుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. దాంతో కేసుకు ముగింపు పలుకుతున్నట్లు ముంబైలోని స్థానిక కోర్టు (Mumbai Court) ప్రకటించింది.
దక్షిణ ముంబైలోని మజగావ్ న్యాయస్థానం పాత కేసులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 1977 నాటి రూ.7.65 చోరీ కేసు పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తించింది. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే. చోరీ సొమ్మును రికవరీ చేసినప్పటికీ దాన్ని ఫిర్యాదుదారుకు తిరిగి ఇవ్వలేదు. ఎందుకంటే నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీచేసినా నిందితులుగానీ, ఎంత వెతికినా ఫిర్యాదుదారుగానీ దొరకలేదు.
ఫలితంగా కేసు దశాబ్దాలుగా మరుగునపడిపోయింది. ఈ పెండింగ్ కేసును ఇటీవల న్యాయస్థానం విచారించింది. దాదాపు యాభై ఏళ్లుగా కేసు పెండింగ్లో ఉన్నదని, ఎలాంటి పురోగతి లేదని, అలాంటప్పుడు కేసును పెండింగ్లో ఉంచడంలో అర్థం లేదని అభిప్రాయపడింది. నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
రికవరీ చేసిన సొమ్ము రూ.7.65 లను ఆచూకీ దొరికితే ఫిర్యాదుదారుడికి ఇవ్వాలని ఆదేశించింది. అప్పీలు గడువు ముగిసేనాటికి ఫిర్యాదుదారుడి ఆచూకీ లభించకపోతే ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమచేయాలని సూచించింది.