హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బొగ్గు స్కాం వెలుగుచూసిన నేపథ్యంలో సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో సింగరేణి కార్మికలోకం పాల్గొనాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ నిబంధనలు మార్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బావమరిదికి రూ.1,600 కోట్ల టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై నిగ్గు తేల్చడం కోసం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ అనేక కుంభకోణాలకు పాల్పడిందని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. మంత్రుల వద్ద వాటాల పంచాయితీ నడుస్తున్నదని దుయ్యబట్టారు. గతంలో సింగరేణిపై ఏ ప్రభుత్వం కూడా అజమాయిషి చేయలేదని, కానీ, రేవంత్ సర్కార్ మాత్రం అజమాయిషీ చేస్తూ, తద్వారా సంస్థను నిర్వీర్యం చేస్తున్నదని దుయ్యబట్టారు.
నేడు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా ; సింగరేణివ్యాప్తంగా నిరసనలు
గోదావరిఖని, జనవరి 20: సింగరేణిలో అవినీతి టెండర్లకు నిరసనగా టీబీజీకేఎస్ ఆందోళనకు సిద్ధమైంది. బుధవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థకు చెందిన నైని బొగ్గు బ్లాక్‌లో మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) టెండర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంతోపాటు సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కార్మికులు తిప్పికొట్టేందుకు బుధవారం సాయంత్రం సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కోల్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో సైట్ విజిటింగ్ పేరిట కొత్త విధానం తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. సింగరేణిని దోచుకునే కుట్రలను, కేంద్రం విధానాలను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అనుసరిస్తున్న చర్యలను తిప్పి కొడుతామని హెచ్చరించారు.