భీమదేవరపల్లి, ఆగస్టు 23: భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరిలో (Ratnagiri) గుట్టపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. గుట్ట కింద ఉన్న ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుట్ట పైకి ఎక్కి గుహలో కొలువు దీరిన స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ఇందారం శ్రీనివాస శర్మ భక్తులకు గోత్ర నామార్చన తో పాటు ప్రత్యేక పూజలు చేశారు. జాతర నిర్వాహకులు గుట్టపైకి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టినప్పటికీ దారి సక్రమంగా లేకపోవడంతో భక్తులు గోవింద నామస్మరణతో పైకి ఎక్కారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గుట్ట పై కొన భాగానికి వెళ్లి శిఖరం వద్ద దీపంలో నూనె పోశారు. తమ కష్టాలు తొలగి పోవాలని, కోరిన కోరికలు నెరవేర్చాలని దీపంలో నూనె పోశారు.
గుట్టపై నుండి చుట్టూ పచ్చని పంట పొలాలు, ప్రకృతి రమణీయత, ఆహ్లాదకర వాతావరణం కనిపించడంతో భక్తులు ప్రకృతి అందాలను వీక్షించి పులకరించి పోయారు. యువత ప్రకృతి అందాలను తమ సెల్ ఫోన్ లలో బంధించారు. జాతరలో వంగర ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాధికారిణి రూబీనా రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. భక్తుల సౌఖర్యార్థం జాతర నిర్వాహకులు పూర్తి సదుపాయాలు కల్పించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ పర్యవేక్షణలో వంగర, ముల్కనూరు ఎస్సైలు దివ్య, రాజు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జాతరలో భక్తులకు పోలీసులు చేస్తున్న సేవల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.