సుబేదారి, ఆగస్టు 23: నకిలీ బీమా పాలసీ పత్రాలు తయారు చేసి, అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయల నగదు కాజేసిన ముఠాను వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ మంగళవారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టును చూపించి, వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన పుప్పాల రాము, చిట్యాల శ్రీకాంత్, వైనాల పవన్, అడ్డా రాజు, మడిపల్లి వెంకట్రాజం, ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గన్నారపు మహేందర్, హైదరాబాద్‌కు చెందిన జీ మల్లేశ్, డీ వెంకటరావుతోపాటు పరారీలో ఉన్న గండు శ్రీనివాస్, ఇస్లావత్ రమేశ్, నాతి శ్యామ్, ఎండీ రఫీ, దూడల రాజేశ్, చిట్యాల సురేశ్, గుండు మహేందర్, కనుగంటి సుమన్, ఇస్లావత్ రాజ్‌కుమార్, భూక్యా భాస్కర్, భూక్యా శంకర్ ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితులు పుప్పాల రాము, చిట్యాల శ్రీకాంత్ బీమా కంపెనీలో ఏజెంట్లుగా పనిచేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చారు.
నకిలీ బీమా పత్రాలు సృష్టించి డబ్బులు సంపాదించాలని ప్రణాళికలు తయారు చేశారు. ఇందుకు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులను గుర్తించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆధార్‌కార్డుల్లో వయస్సును సవరించారు. నకిలీ ఆధార్, నకిలీ పాన్‌కార్డులు సృష్టించి వ్యాధిగ్రస్తుల పేరుతో బీమా పాలసీలు తయారు చేసేవారు. వ్యాధిగ్రస్తుడు చనిపోయిన తర్వాత పాలసీ నామినీతో బీమా ైక్లెమ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసేవారు. ఇందుకు వచ్చే పాలసీ డబ్బుల్లో 20 శాతానికి పైగా తీసుకునేవారు. ఇలా లక్షల రూపాయలను ముఠా సభ్యులు కాజేశారు.
ఈ ముఠా మూడేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు దృష్టికి వచ్చింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పక్కా సమాచారంతో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, ట్రాక్టర్, లక్ష రూపాయల నగదు, ల్యాప్‌టాప్, నకిలీ పత్రాలు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 11 మంది పరారీలో ఉన్నారు. కేసులో ప్రతిభచాటిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీఐ నరేశ్‌కుమార్, వెంకటేశ్వర్లు, నల్లబెల్లి ఎస్సై రాజారాం, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శ్యాంసుందర్, అశోక్, స్వర్ణలత, సృజన్, శ్రావణ్, నాగరాజు, సురేశ్, నవీన్, శ్యామ్, శ్రీనివాస్‌ను అదనపు డీసీపీ అభినందించారు.