హనుమకొండ సిటీ, జూలై 16: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్న నీట్ పరీక్షకు నగరంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో సర్వం సిద్ధం చేసినట్లు వరంగల్ సెంటర్ నీట్ కో ఆర్డినేటర్ మాథ్యాస్రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులతోపాటు సరిహద్దు జిల్లాల విద్యార్థుల సౌకర్యార్ధం వరంగల్ కేంద్రంగా 11 సెంటర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందులో హనుమకొండలో 9, జనగామలో రెండు సెంటర్లు ఉన్నట్లు వెల్లడించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన తొమ్మిది పరీక్ష కేంద్రాలను 4676 మంది విద్యార్థులకు కేటాయించగా, జనగామలోని రెండు కేంద్రాల్లో 487 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, బయోమెట్రిక్ పూర్తి చేసిన తర్వాతే పరీక్ష హాల్లోకి పంపిస్తారని తెలిపారు. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్లతోపాటు పాస్ఫాటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, తెల్లని వాటర్ బాటిల్, 50 ఎంఎల్ శానిటైజర్ బాటిల్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు. బంగారు ఆభరణాలు, జీన్స్ ధరించకుండా సాధారణ దుస్తుల్లో రావాలని కోరారు. సెంటర్లోనే మాస్క్, బాల్ పెన్ను ఇస్తారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.