హనుమకొండ చౌరస్తా, జూలై 17 : తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క ఉద్యమకారుడిని విస్మరించవద్దని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ గుడిమళ్ల రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో కమిటీకి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ చర్యలపై వారు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి త్యాగం చేసిన వేలాది మంది ఉద్యమకారుల పోలీసు రికార్డులు, మీడియా వార్తలు, కమిటీ పరిశీలన ఆధారంగా ఉద్యమకారుల పూర్తి జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ప్రతి గుర్తింపుపొందిన ఉద్యమకారుడికి 250 గజాల స్థలం కేటాయించాలని, రూ.25 వేల పెన్షన్ మంజూరు చేయాలని, వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. రూ.5 వేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి శాశ్వత సంక్షేమ చర్యలు చేపట్టాలని, ఉచిత బస్పాస్, ఆరోగ్య బీమా, ప్రాధాన్య వైద్య సేవలు, గుర్తింపు పొందిన ఉద్యమకారులకు 3 బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు.
ఉద్యమకారుల కుటుంబాలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల్లో 10 రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల భవనాలు నిర్మించి, ఉద్యమకారుల సమావేశాలు, కార్యకలాపాలు, సంక్షేమ కార్యక్రమాలకు శాశ్వత వేదిక ఉపయోగించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో జిల్లా అధ్యక్షుడు శ్యామ్ తదితరులు ఉన్నారు.