హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11: చిలుకూరు బాలాజీ దేవాలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు ఎం.వి రంగరాజన్ పై దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్ శర్మ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, యాదాద్రి దేవస్థానం రిటైర్డ్ అర్చకులు కారంపొడి నరసింహాచార్యులు, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తనుగుల రత్నాకర్, వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి రంగరాజన్‌ను పరామర్శించారు. కొంతమంది రామరాజ్యం పేరిట దౌర్జన్యాలకు దిగడం శోచనీయమన్నారు.
అర్చకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగనిస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించినా చర్యకు ప్రతి చర్య ఉంటుందని, హిందూ సంఘాలన్నీ ఏకమై అర్చక వ్యవస్థను కాపాడుకోవాలన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన వల్ల సమాజానికి మంచిది కాదని, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. సోషల్ మీడియాలో అనైతికమైన పోస్టులు పెట్టడం సనాతన ధర్మాన్ని విమర్శించడం సరికాదాన్నారు.