జయశంకర్ భూపాలపల్లి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): గూడు చూపిన గులాబీ పార్టీకి కృతజ్ఞత చూపారు నిరుపేదలు. తమకు నీడనిచ్చిన పార్టీ నేతలు శుక్రవారం డబుల్ బెడ్రూం ఇండ్లలో పర్యటించగా ఆనందంతో పొంగిపోయారు. ఘనంగా స్వాగతం పలుకుతూ కాలనీలో కొరవడిన సౌకర్యాలపై ఏకరువు పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లి వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం 544 డబుల్ బెడ్రూం ఇండ్లను షేర్వాల్ టెక్నాలజీతో నిర్మించి పేదలకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కాగా, పురపాలక ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ డబుల్ బెడ్రూం ఇండ్లలో బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు.
కాలనీవాసులు గండ్రకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. కాలనీకి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, కాలనీవాసులు బీఆర్ఎస్లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పట్టించుకున్నవారే లేరని, బిందెలతో ధర్నా చేసినా ఫలితం లేదని, కేవలం ట్రాన్స్ఫార్మర్ బిగించి వదిలేశారని, ఇప్పటికీ మాకు మిషన్ భగీరథ నీరు అందించడం లేదని గండ్రకు విన్నవించారు. కాలనీ నుంచి భాస్కర్గడ్డ వరకు రోడ్డు నిర్మించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉందని వాపోయారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్తో ఏ పనీ జరగదని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు.