– డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 23 : క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న వయసులోనే క్రమశిక్షణ, కష్టపడే స్వభావం అలవాటు చేసుకుంటే పెద్దస్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశానికి హెడ్మాస్టర్ రవికుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధికి టీచర్లు, తల్లిదండ్రులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక ధైర్యం కూడా పెరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా చదువులో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విజేతలైన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించి వారి కృషిని ప్రశంసించారు. జూడో అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి కైలాస్ యాదవ్, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ టీచర్లు, కోచ్‌లు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.