Full fee concession | హనుమకొండ చౌరస్తా, జులై 16 : టీజీ పాలిసెట్-2025 కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న అభ్యర్థులలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, నవోదయ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖల ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించనున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ రీయింబర్స్మెంట్ పొందాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా 18లోపు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను సందర్శించి తమ వివరాలను తెలియజేయాలని, ఈ అవకాశం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ఆధారంగా పరిశీలనకు లోబడి అమలవుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా భవిష్యత్‌కు బలమైన పునాది, వినియోగవంతమైన, ఆచరణాత్మక నైపుణ్యాలు కలిగిన విద్య కోసం పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
తక్కువ కాలంలో నైపుణ్యాల విద్య తక్కువ ఖర్చుతో చదువు, ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశం, ఇంజినీరింగ్ డిగ్రీలో లేటరల్ ఎంట్రీ (బీటెక్, బీఈ రెండో సంవత్సరం) సత్వర ఉద్యోగావకాశాలు, మోడ్రన్ బ్రాంచ్‌లు-ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు నాణ్యమైన విద్యతోపాటు, విద్యార్థులకు ప్రభుత్వ సహాయాలను అందిస్తూ, విజ్ఞానం, ఉద్యోగ భద్రత కలగలిసిన భవిష్యత్‌ను నిర్ధారిస్తాయని చెప్పారు. వివరాలకు https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రిన్సిపాల్ ప్రభాకర్ సూచించారు.