భీమదేవరపల్లి, మార్చి 18: నీ దాకా వస్తే గాని నొప్పి తెలవలేదా.. రాజకీయాల్లో విలువలతో పాటు అతని కుటుంబంలో భార్యా, పిల్లలు ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం, సీఎం రేవంత్ రెడ్డి భాష తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిపై రాజకీయ విమర్శలు ఉంటాయని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమూ సమంజసమే అన్నారు. అయితే వ్యక్తిగత దూషణలు, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను సైతం ఈ రొంపిలోకి లాగి ఇష్టానుసారంగా నీచ ప్రచారానికి దిగడం దుర్మార్గం అని మండి పడ్డారు.
తెల్లారింది మొదలు బూతుపురాణమే ప్రాతిపదికగా ఉద్యమ నేత, అందులో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పెద్ద మనిషిని నోటికొచ్చినట్టు దూషించిన వారెవరో ఆలోచించుకోవాలన్నారు. ఈ వికృత ప్రచారం, ఇప్పుడు వెర్రితలలు వేస్తుండటంతో దానిపై చిందులేస్తున్నదెవరరో తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుందన్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు సోషల్ మీడియాలో ఇలాంటి పోకడలను అరికట్టేందుకు అవసరమైతే చట్టాలను తీసుకురావాలని సూచించారు. నాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి నీచానికి ఒడిగట్టారో గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలు మాని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.