హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 10: హనుమకొండలోని ప్రోగ్రెస్ హై స్కూల్లో ఈనెల 8న పాఠశాలలో నిర్వహించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్సర్టిఫికేషన్ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు అరుదైన జ్ఞాపకశక్తి ప్రదర్శనతో విశిష్ట ఘనతను సాధించినట్లు ప్రోగ్రెస్ హై స్కూల్ ప్రిన్సిపల్, కరస్పాండెంట్ మల్లాడి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ర్టంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లను, ఎలాంటి సూచనలు లేకుండా, పూర్తిగా జ్ఞాపకశక్తి ఆధారంగా, మూడు నిమిషాలలోపే నిరంతరంగా పఠించడం ద్వారా తమ అసాధారణ మేధస్సును ప్రదర్శించారు.
ఈ అత్యంత క్లిష్టమైన జ్ఞాపక ప్రదర్శనను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్అధికారికంగా పరిశీలించి, రికార్డుగా నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘనత సాధించిన ఉపాధ్యాయులు గుడి వాణిరెడ్డి, షేక్ షరీఫాబేగం, వరాల రావళిక, బి. మౌనిక, ఎన్.కృష్ణవేణి ఉన్నారు. ఈ ఉపాధ్యాయులు తమ అపూర్వ జ్ఞాపకశక్తి, తార్కిక నైపుణ్యాలు, క్రమశిక్షణ, బోధనా నిబద్ధతతో ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నట్లు పేర్కొన్నారు.